యూపీలో బీజేపీ భారీ విజయం: తాజా ఎగ్జిట్‌పోల్‌

9 Mar, 2022 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు కొత్త పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని.. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెల్లడించింది. 

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 43 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్‌పీ 15 శాతం, కాంగ్రెస్‌ 3 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సంపాదిస్తారని తెలిపింది. తాము అంచనా వేసిన దానికి 3 శాతం అటుఇటుగా ఫలితాలు రావొచ్చని వెల్లడించింది. 

పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 29 శాతం, శిరోమణి అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీ, ఇతరులకు 7 శాతం చొప్పున ఓట్లు వస్తాయని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ ఎగ్జిట్ పోల్‌ అంచనా కట్టింది. తుది ఫలితాలు, ఎగ్జిట్‌పోల్‌కు మధ్య 4 శాతం వ్యత్యాసం ఉండొచ్చని తెలిపింది. (క్లిక్‌: ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్‌ పోల్స్‌)

ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీకి రెండో స్థానం దక్కనుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ ఎగ్జిట్ పోల్‌లో తేలిందని రాజకీయ విశ్లేషకుడు సంజయ్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది గురువారం(మార్చి 10న) తేలనుంది. (క్లిక్‌: వర్మ ఓవరాక్షన్‌.. అక్కడే మకాం)

మరిన్ని వార్తలు