ఇక చాలు ఆపండి ఇప్పటికే వర్గపోరుతో నష్టపోయాం 

29 Dec, 2023 04:27 IST|Sakshi

ఇంకా పార్టీకి నష్టం జరిగితే ఉపేక్షించం..  

ఎంత పెద్ద నాయకుడైనా  చర్యలు తప్పవు 

పార్టీ నేతలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హెచ్చరికలు 

వచ్చే ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీ చాన్స్‌? 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్గ విభేదాలు, కొందరు ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లేమి కారణంగా బీజేపీ నష్టపోయిందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ’పార్టీపరంగా పెద్ద హోదా ఉందని, తాము ఏం చేసినా చెల్లుతుందంటే కుదరదు.. పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి పెద్దవారినైనా ఉపేక్షించే పరిస్థితే ఉండదు. ’అని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.

అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపరిచాయని ఆయన వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. కొందరు ముఖ్యనేతల ఆధిపత్యపోరు, సోషల్‌ మీడియా వేదికగా ఒక వర్గంపై మరో వర్గం వ్యతిరేక పోస్టులు పెట్టడం వల్ల పార్టీ ఇమేజ్‌కి, పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది.  

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని తాము ఆశించామని, ఐతే పైన పేర్కొన్న కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామని పేర్కొన్నట్టు తెలిసింది. గురువారం రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు అమిత్‌షా నగరానికి వచ్చిన సందర్భంగా తొలుత నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీనేతలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులు భేటీ అయ్యారు. 

వారిద్దరినుద్దేశించే ఆ వ్యాఖ్యలా? 
పార్టీ నేతల్లో ముఖ్యంగా సంజయ్, ఈటల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తి, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నందు వల్ల వారిని ఉద్దేశించే పరోక్షంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారంటూ పార్టీనాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు నేతల ముందే సీనియర్లకు అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నట్టు తెలిసింది. పరస్పర ఆరోపణలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభకు సన్నద్ధం కావడంతో పాటు నేతల మధ్య మెరుగైన సమన్వయానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డికి ఆదేశించినట్టు సమాచారం. 

జరిగిందేదో జరిగింది... 10 ఎంపీ స్థానాలు గెలిచేలా.. 
ఇక జరిగిందేదో జరిగింది.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి 10 ఎంపీ స్థానాల్లో గెలుపొందేలా నాయకులంతా విభేదాలన్నీ పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో గెలిచిన నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకే మళ్లీ పోటీకి అవకాశం కల్పిస్తామని, మిగిలిన సీట్లలో నాయకుల గెలుపు అవకాశాలపై నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం.  

>
మరిన్ని వార్తలు