Bandi Sanjay: కేసీఆర్‌ కోటను ఢీకొడతాం

20 Aug, 2021 09:22 IST|Sakshi
కోదాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్, పక్కన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): ప్రజల త్యాగం, విద్యావంతుల పోరాటం, వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో సాధించుకున్న తెలంగాణలో నియంత మాదిరిగా గడీల పాలన చేస్తున్న కేసీఆర్‌ కోటను బద్దలు కొట్టడం తెలంగాణ ముఖద్వారమైన కోదాడ నుంచే ప్రారంభమైందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం కోదాడలోని రంగా థియేటర్‌ సెంటర్‌లో, సూర్యాపేట పట్టణంలోని వాణిజ్యభవన్‌ సెంటర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ హామీలతో ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల్లో నెగ్గుతున్న సీఎంకు త్వరలో జరగబోయే హూజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు తగినబుద్ది చెపుతారని అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపి అధికారంలోకి వస్తుందని, ఆ సంవత్సరం స్వాతంత్య్ర వేడుకల్లో గోల్కొండ కోటపై బీజేపీ సీఎం జాతీయజెండాను ఎగుర వేయడం ఖాయమని ఆయన అన్నారు. బీజేపిలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, దానికి  కిషన్‌రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు.

సామాన్య కార్యకర్త నుంచి 130 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రి స్థాయికి ఆయన ఎదగడం తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. కోదాడ పక్క నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల సమయంలో రూ.100 కోట్ల హామీలు ఇచ్చిన పెద్దలు.. ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, అక్రమ డబ్బుతో గెలిచిన అక్కడి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు గుర్రంబోడు గిరిజనుల భూములు ఆక్రమించారని అన్నారు.

ఇదేమిటని ప్రశ్నించిన గిరిజనులపై పోలీసుల ద్వారా లాఠీచార్జీ చేయించి, జైళ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ఎన్నికలు రాగానే దళితబంధు అంటూ మాయమాటలు చెపుతున్నాడని, ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన కోరారు. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడని, వాటి సంగతి ఏంటో ఇప్పుడు దళితులు నిలదీయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం ఆయన ఇంటిలో అందరికి ఉద్యోగాలు  ఇప్పించుకున్నాడని విమర్శించారు.

ప్రజలు అండగా ఉండాలి 
తెలంగాణా ప్రజలు టీఆర్‌ఎస్‌ మోసపూరిత మాటల్లో పడకుండా బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే  ప్రధాని కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా ఇచ్చారని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఉర్లుగొండతో పాటు, ఫణిగిరి బౌద్ధక్షేత్రం, పిల్లలమర్రి దేవాలయం లాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలిపి అభివృద్ధి పరిచేలా చూస్తామన్నారు.

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కేసీర్, రేవంత్‌రెడ్డి వేరు కాదని.. ముగ్గురూ ఒక్కటేనని అన్నారు. ఈ సభల్లో ప్రేమేందర్‌రెడ్డి, రజనీకుమారి, బొబ్బ భాగ్యారెడ్డి, కడియం రాంచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, వెంకట్‌రెడ్డి, పల్స మల్సూర్‌గౌడ్, కార్తీక్‌రెడ్డి, మంగ్తానాయక్, మీర్‌ ఆక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు