సీఎం కేసీఆర్‌వి తుగ్లక్‌ నిర్ణయాలు: బండి సంజయ్‌

31 Dec, 2021 09:41 IST|Sakshi
శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

సాక్షి, వరంగల్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సీఎం కేసీఆర్‌ తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. వరంగల్‌లోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బీజేపీ రాజకీయ శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంజయ్‌ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 36 నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంటే.. సీఎం కేసీఆర్‌ 36 నెలలుగా ఫాంహౌస్‌లో పడుకొని.. ఆగమేఘాలపై జీఓ 317 జారీ చేసి ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు.

స్థానికత కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. అదే స్థానికత పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను చీల్చి గోస పుచ్చుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన 370 యాక్ట్‌ వచ్చినట్లు ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, భార్యాభర్తల బదిలీల్లో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అన్యాయం జరిగిందని అర్జీ పెట్టుకున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొందన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అన్యాయాన్ని పునః పరిశీలించి అందరికి న్యాయం చేయాలని, 317 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఉద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని సంజయ్‌ హెచ్చరించారు. 

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేసినప్పుడే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వి.శ్రీ రాములు, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి, నాయకులు చింతాకుల సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా!

మరిన్ని వార్తలు