భైంసాను మైసాగా మారుస్తాం

30 Nov, 2022 02:47 IST|Sakshi
బహిరంగ సభ వేదికపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అధికారంలోకి రాగానే దత్తత

అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం 

కేసీఆర్‌కు ఇక మూడింది.. వచ్చేది బీజేపీ సర్కారే 

ప్రజా సంగ్రామయాత్ర సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

వెయ్యిమంది కేసీఆర్‌లు, ఒవైసీలు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

కేసీఆర్‌ చెప్పుచేతల్లో పోలీసులు: ఈటల   

నిర్మల్‌: ‘కేసీఆర్‌కు ఇక మూడింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే. మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటగా భైంసాను మైసా (మహిషా)గా మారుస్తాం. దత్తత తీసుకుని భరోసా ఇస్తాం. అల్లర్ల బాధితులను ఆదుకుంటాం. వారికి ఉద్యోగాలనూ ఇస్తాం. అందుకే ఐదోవిడత ప్రజాసంగ్రామ యాత్రను ఇక్కడ నుంచి ప్రారంభించాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భైంసా బహిరంగ సభలో చెప్పారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రూ.5 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్‌ సాధించిందేమిటని ప్రశ్నించారు.

ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?, ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఏమైంది? దళితబంధు, రుణమాఫీ హామీలు అమలు చేశారా? అని నిలదీశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ సభ భైంసా శివారులోని గణేశ్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో మంగళవారం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపూరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి సహా సీనియర్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. సభ అనంతరం బండి సంజయ్‌ తన పాదయాత్రను కొనసాగించారు. భైంసా మండలంలోని గుండెగాం సమీపంలోని శిబిరంలో మంగళవారం రాత్రి బస చేశారు. 
 
కాంట్రాక్టర్‌ కేసీఆర్‌ చుట్టం 
బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు తమ సమస్యలపై ఉద్యమం చేస్తే, కాంట్రాక్టర్‌గా ఉన్న కేసీఆర్‌ చుట్టంతో విద్యార్థులపై కక్ష సాధింపు కేసులను పెట్టించాడని బండి సంజయ్‌ మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గేట్ల మెయింటనెన్స్‌కు నిధులు ఇవ్వలేనోడు.. రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని ప్రశ్నించారు.

భైంసా అంటేనే కేసీఆర్‌కు భయమని, సభకు వచ్చిన జన స్పందనను చూసి ఫుల్‌ బాటిల్‌ తాగుతాడని ఎద్దేవా చేశారు. భైంసా ఒంటరిది కాదని, ప్రతీ హిందువు భైంసా వెనుక ఉన్నారని అన్నారు. అల్లర్ల సమయంలో హిందూవాహిని యువకులు బాధితుల పక్షాన చేసిన పోరాటం మరిచిపోలేమన్నారు.   
 
కేసీఆర్‌ పతనం ప్రారంభమైంది 
కేసీఆర్‌ ప్రభుత్వ నియంతృత్వ పాలనలో జరుపుకుంటున్న ప్రత్యేక సభ ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా ప్రజాసంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వేయిమంది కేసీఆర్‌లు, ఒవైసీలు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరన్నారు. కేసీఆర్‌ ఇప్పుడు ప్రగతిభవన్‌లో ఉన్నాడో, ఫామ్‌హౌస్‌లో ఉన్నాడో తెలియదని, అలాంటి వ్యక్తి బీఆర్‌ఎస్‌ పెట్టి, నరేంద్రమోదీని అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు.  
 
ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు: ఈటల  
సీఎం కేసీఆర్‌ తన చెప్పుచేతల్లో ఉండే పోలీసులతో ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభను అడ్డుకోవాలని చూశారని, కానీ కోర్టు అనుమతి ఇచ్చిందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు సైతం తమ సమస్యలపై ఉద్యమం చేశారని పేర్కొన్నారు. ఎండనకా, వాననకా ఉద్యమించిన విద్యార్థులకు హట్సాఫ్‌ చెప్పారు. విద్యార్థుల ఉద్యమంతో సీఎం కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ దిగివచ్చాడన్నారు.

రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో బల్లులున్న అన్నం పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హాస్టళ్లలో కేసీఆర్‌ తన మనువడిని ఉంచుతాడా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉంటూ రాజకీయాలు చేసే సీఎంకు విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకునే తీరిక లేదన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని, కేసీఆర్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సభలో పాదయాత్ర ప్రముఖ్‌ జి మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్‌ టి.వీరేందర్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

ఆడబిడ్డపై దాడి చేస్తారా..: కిషన్‌రెడ్డి 
నిన్న ఆడబిడ్డ అని కూడా చూడకుండా వైఎస్‌ షర్మిల వాహనాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తగలబెట్టారని, పోలీసులు ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ఆదేశాలతోనే పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మెట్రో రెండోఫేజ్‌ను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈటలను హుజూరాబాద్‌లో ఓడించేందుకే దళితబంధు తెచ్చారని తెలిపారు.

అది దళితబంధు కాదని, ఈటల రాజేందర్‌ బంధు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్, సున్నపుక్వారీల భూములన్నీ కేసీఆర్‌ కుటుంబానివే అని పేర్కొన్నారు. కేసీఆర్‌ అవినీతి, కుంభకోణాలపై బీజేపీ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తామని, అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు