Bandi Sanjay: కేసీఆర్‌వన్నీ మోసపూరిత హామీలే

19 Sep, 2021 10:17 IST|Sakshi
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పాదయాత్ర చేస్తున్న కేంద్రమంత్రి భగవంత్‌ ఖుబా, సంజయ్‌

సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చేవన్నీ మోసపూరిత హామీలేనని, ప్రజలకు ఆయన చేసిందేమి లేదని కేంద్రమంత్రి భగవంత్‌ ఖుబా విమర్శిం చారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మాటతప్పారని, అలాగే దళితులకు మూడె కరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని ఆరోపించారు.

బండి సంజయ్‌ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్‌ తన కొడుకు, కూతురు, అల్లుడి కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఫామ్‌ హౌస్‌కు సాగనంపాలన్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు మాట్లాడితే మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. 

డ్రోన్‌ కెమెరా తగిలి సంజయ్‌కు గాయం 
పాదయాత్రలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిలో సభ ముగిసిన తరువాత హజీపూర్‌ తండా వద్ద గిరిజనులు ఆయనకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సమయంలో పూలు డ్రోన్‌ కెమెరాపై పడటంతో అది ఆగిపోయి కిందికి జారింది. ఈ క్రమంలో డ్రోన్‌ కెమెరా, సంజయ్‌ నుదిటిపై నుంచి రాసుకుంటూ వెళ్లింది. దీంతో ఆయనకు చిన్న గాయమైంది. ఒక్క క్షణం అందరూ ఆందోళనకు గురైనా, పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో తేరుకున్నారు. అనంతరం పాదయాత్ర యథావిధిగా కొనసాగింది.   

చదవండి: బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి 

మరిన్ని వార్తలు