సీబీఐ దర్యాప్తు జరిపించాలి

8 Mar, 2023 01:44 IST|Sakshi

ఆధారాల్లేకుండానే వేలాది జనన, మరణ సర్టిఫికెట్లు, కార్డుల జారీపై బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాతబస్తీలో ఎలాంటి ఆధారాల్లేకుండా జారీచేసిన 27 వేల జనన, 4 వేల మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు రేషన్, ఓటర్‌ కార్డులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్‌ఎంసీలో పేరుకుపోయిన అవినీతికి ఈ ఉదంతం నిదర్శనమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్‌ పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పెద్దలు, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత భారీగా సర్టిఫికెట్ల జారీకి అవకాశం లేదని.. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ జరిపి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలాదిగా సర్టిఫికెట్ల జారీ ఆందోళన కలిగించే అంశమన్నారు. 

దేశంలో అల్లర్లకు ఉగ్ర కుట్ర.. 
జీహెచ్‌ఎంసీ జారీచేసిన బర్త్‌ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ ఉగ్రవాదులు పాస్‌పోర్టులు పొంది హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ‘ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు కేసీఆర్‌ ధారాదత్తం చేశాడు. ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా అనుమతి లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని అనడంతోపాటు 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్‌ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్‌’అని మండిపడ్డారు.

టీఆర్‌ఎస్, ఎంఐఎం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీ మొత్తం జల్లెడపడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలసి వాస్తవాలు వెలుగులోకి వచ్చేదాకా ఉద్యమిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు