బీజేపీలో కలవరం.. కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక   

22 Nov, 2022 08:45 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతాపార్టీ జిల్లా (గ్రామీణ) అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అలకబూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుక వహించిన బొక్క.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో పార్టీగా రెండుగా చీలడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది.

ఈ నేపథ్యంలోనే నర్సింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్‌ కన్వీనర్‌ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవంలేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోషం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకింత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

చెల్లుబాటు కాకపోవడంతో..  
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్‌కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్కా కొన్నిపేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు.

పార్టీలో తన మాట చెల్లుబాటుకాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా.. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కానీ, పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాలను తెచ్చిపేట్టే అవకాశం లేకపోలేదు.   

శిక్షణ తరగతులకు దూరంగా.. 
క్షేత్రస్థాయి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్‌ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శామీర్‌పేటలో పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కేడర్‌ ఈ శిబిరానికి హాజరైంది.

బొక్కా నర్సింహారెడ్డి మాత్రం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్‌ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి అందెల శ్రీరాములు, తూళ్ల దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ కూడా పోటీపడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత కేడర్‌ను తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గపోరు కూడా ఆయన మనస్తాపం చెందటానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.    

మరిన్ని వార్తలు