‘సిసోడియాకు భారతరత్న.. ఆయనకు నోబెల్‌ ప్రైజ్‌’.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

23 Aug, 2022 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో సీబీఐ సోదాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం మొదలైంది. ఢిల్లీలో విద్యావ్యవస్థ కోసం పాటుపడిన ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలంటూ గుజరాత్‌ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ భారతరత్న వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీజేపీ నేత, కాషాయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌. ప్రస్తుతం మనీష్‌ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలని కోరిన కేజ్రీవాల్‌.. తర్వాత తనకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వమంటారేమోనంటూ ఎద్దేవా చేశారు. 

‘సత్యేంద్ర జైన్‌కు పద్మ విభూషణ్‌, మనీష్‌ సిసోడియాకు భారతరత్న.. తర్వాత ఆయనకు నోబెల్‌ ప్రైజ్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ గొప్ప అరాచక పార్టీ.’ అంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ బీఎల్‌ సంతోష్‌. మరోవైపు.. ఆప్‌ పార్టీ నేతల ఆరోపణలపై బీజేపీ నేతలు ధీటుగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆపరేషన్‌ కమలం ఢిల్లీలో విఫలమైందని సోమవారం వ్యాఖ్యానించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. దీనికి తనదైన శైలీలో సమాధానమిచ్చింది బీజేపీ.

ఇదీ చదవండి: ‘మనీష్‌ సిసోడియా ‘భారతరత్న’కు అర్హుడు.. అలాంటి వ్యక్తిపై సీబీఐ దాడులా?’

మరిన్ని వార్తలు