‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’

6 Jun, 2021 18:13 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు.

అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు

మరిన్ని వార్తలు