సీబీఐ విచారణ జరిపించాలి: డీకే అరుణ

4 Mar, 2022 04:49 IST|Sakshi

శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర వ్యవహారంపై డీకే అరుణ డిమాండ్‌ 

ప్రశాంత్‌ కిషోర్‌ పథకం ప్రకారమే ఈ నాటకం

మంత్రి అనుచరుల అరాచకాలు శ్రుతిమించాయని వ్యాఖ్య

సాక్షి,హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రకు సంబంధించిన మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే కట్టుకథ అల్లారని, హత్యకు కుట్ర అంటూ పోలీసులు, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి కథను రక్తి కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఆదేశాలు లేకుండా పోలీసు కమిషనర్‌స్థాయి వ్యక్తి తప్పుడు కేసులు పెట్టే సాహసం చేయరని, ఈ కుట్రలో ఏ1గా సీఎం కేసీఆర్, ఏ2గా శ్రీనివాస్‌ గౌడ్‌ నిలుస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఈ పరిణామాలపై పార్టీ జాతీయ నాయకత్వానికి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసి సీబీఐ విచారణ కోరతామన్నారు. గురువారం పార్టీ నాయకులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కొల్లి మాధవి, భరత్‌గౌడ్‌లతో కలిసి అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ హత్య సుపారీకి రూ.12 కోట్లు, 15 కోట్లు అని బూటకపు మాటలు చెబుతున్నారని, అంత ఆర్థిక శక్తి ఉన్న వారెవ్వరూ అక్కడ లేరని అరుణ అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పథకం ప్రకారమే ఈ నాటకానికి తెరతీసినట్టున్నారని సందేహం వ్యక్తంచేశారు.  

ఎదిరిస్తున్న వారిపై తప్పుడు కేసులు 
మహబూబ్‌నగర్‌ భూలావాదేవీల్లో మంత్రి శ్రీని వాస్‌ గౌడ్‌ అనుచరుల అరాచకాలు శ్రుతిమించాయని, వారిని ఎదిరిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అరుణ ఆరోపించారు. ‘శ్రీనివాస్‌గౌడ్‌పై ఎలాంటి కుట్రలు చేయాల్సిన అవస రం మాకు లేదు. మంత్రి తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చినట్లు రాఘవేంద్రరాజు ఎలక్షన్‌ పిటిషన్‌ వేశాక మమ్మల్ని కలిస్తే మద్దతునిచ్చాం. ఈ పిటిషన్‌ వెన క్కి తీసుకోవాలని రాఘవేంద్రరాజుపై మంత్రి ఒత్తిడి తెచ్చినా వెనక్కు తగ్గకపోవడంతో కిడ్నాప్‌ చేయించారు. మున్నూరు రవి ఉద్యమ విద్యార్థి నేత, కేసీఆర్‌కు వీరాభిమాని.. ఆయనకు, శ్రీనివాస్‌గౌడ్‌కు మధ్య ఏం విభేదాలు వచ్చాయో మాకు తెలియదు. గత ఏప్రిల్‌ 27న శ్రీనివాస్‌గౌడ్‌పై 19 ఎకరాల 35 గుంటల భూమి విషయంపై సీఎంవోకు మున్నూరు రవి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సొంత పార్టీ వాళ్లే మంత్రి వేధింపులు తట్టుకోలేక ఏకమై ఇలా చేసి ఉండొచ్చు’అని ఆమె పేర్కొ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పులిలా గర్జించిన కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఇప్పుడు కేసీఆర్‌ ముందు పిల్లిలాగా మారారని ఎద్దేవాచేశారు. 

మరిన్ని వార్తలు