సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయి..

19 Aug, 2021 08:18 IST|Sakshi
మాట్లాడుతున్న డీకే అరుణ, చిత్రంలో ఎంపీ సోయం, నాయకులు హరీశ్‌బాబు, సత్యనారాయణ

సాక్షి, దహెగాం(ఆదిలాబాద్‌): ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అని, హుజురాబాద్‌ ఎన్నికల నేపథ్యంలోనే మరోసారి మోసం చేసేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరి హారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయ కులు పాల్వాయి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో దహెగాంలో బుధవారం రైతు మహాధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా రాగా, ఎంపీ సోయం బాపూరావ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ భారీ వర్షాలతో పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకోవడం కేసీఆర్‌ విఫలమయ్యారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్‌ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు చెల్లిస్తే పంటలు దెబ్బతిన్న వారికి రూ.800 కోట్లు వచ్చేవని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ అనంతరం దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూపంపిణీ చేస్తానని మభ్యపెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం దళితబంధు పేరుతో నాటకం ఆడుతున్నారని అన్నారు. బతుకులు బాగుపడతాయని ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ సాధిస్తే రూ.4లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు రైతులు తగిన బుద్ధిచెప్పాలని సూచించారు.

పోడు జోలికి వస్తే ఖబడ్దార్‌: ఎంపీ సోయం
పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న ఆదివాసీ రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌ కేసీఆర్‌ అని ఎంపీ సోయం బాపూరావ్‌ హెచ్చరించారు. దగ్గరుండి పోడు సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎంత మంది రైతుల సమస్యలు పరిష్కరించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో పోడు రైతులపక్షాన పోరాడితే నాయకులు, రైతులపై కేసులు బనాయించి జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. పోడు కోసం కుమురం భీం తరహాలో పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్‌ను బీజేపీ గద్దెదించుతుందని పేర్కొన్నారు. 

ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్, నియోజకవర్గ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, కొంగ సత్యనారాయణ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్గం నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, నాయకులు రాంటెంకి సురేష్, రాపర్తి ధనుంజయ్, షాకీర్, సురేష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు డీకే అరుణతో పాటు నాయకులు ట్రాక్టర్‌పై వేదిక వద్దకు వచ్చారు. స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
     

మరిన్ని వార్తలు