‘ఆ ఎమ్మెల్యేది కర్ణాటకా.. తెలంగాణా?’

27 Jan, 2021 17:20 IST|Sakshi

నారాయణ పేట ఎమ్మెల్యేపై మండి పడ్డ అరుణ

రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడున్నారు

రామ మందిర నిర్మాణంతో దేశంలో అభివృద్ధి

సాక్షి, మహాబూబ్‌నగర్‌: నారాయణ పేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పార్టీ మారినా ఇంకా ఇక్కడ వలసలు కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ 7 సంవత్సరాల పాలనలో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎక్కరాకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. జిల్లాకు సాగునీటి విషయంలో సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీని గురించి ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాత్రం సీఎంను అడిగే ధైర్యం చేయటం లేదని మండి పడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావని తెలిసినా.. ఎమ్మెల్యేలు కిక్కురుమనడటం లేదన్నారు. నారాయణపేట ఎమ్మెల్యేది కర్ణాటకనా లేక తెలంగాణనా అని అర్థం కావడం లేదన్నారు. ఆయన కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇక్కడున్నారని అరుణ విమర్శించారు.

ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి నారాయణపేట అభివృద్ధిలో ఇంకా వెనకపడిందని అరుణ ఆరోపించారు. జిల్లాకు శాంక్షన్‌ అయిన సైనిక్‌ స్కూల్‌, రైల్వే లైన్‌కు మోక్షమెప్పుడు లభిస్తుందో తెలియన పరిస్థితి ఉందన్నారు. కేవలం పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించే 0.40టీఎంసీల నీటి ద్వారా 12.50లక్షల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో అర్థం అవటం లేదన్నారు.  ప్రాజెక్టుకు భూ సేకరణ పూర్తి కాలేదు కానీ సీఎం ఈ సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని ఆమె ప్రశ్నించారు.
(చదవండి: ‘ఒకరు కొట్టినట్లు.. ఇంకొకరు ఏడ్చినట్లు)

రామ మందిర నిర్మాణంతో దేశంలో శాంతి
హిందువుల వందల సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో నెరవేరబోతుందన్నారు అరుణ. పార్టీలకతీతంగా 2023 వరకు మందిర నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణంతో దేశంలో శాంతి నెలకొని, అభివృద్ధి జరిగి అగ్రరాజ్యాలకు పోటీగా దేశం ముందుకు వెళ్తుందని అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు