బీజేపీకి ఏక్‌నాథ్‌ ఖడ్సే గుడ్‌బై

22 Oct, 2020 04:41 IST|Sakshi

రేపు ఎన్సీపీలో చేరిక

ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే పార్టీని వీడారు. శరద్‌ పవార్‌ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన ముందుకొచ్చారని, శుక్రవారం తమ పార్టీలో చేరబోతున్నారని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ మంత్రివర్గంలో నంబర్‌ 2గా గుర్తింపు పొందిన ఖడ్సే 2016లో భూకబ్జా ఆరోపణలతో రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనకు బీజేపీలో ప్రాధాన్యం లభించడం లేదు.

ఖడ్సే లాంటి ప్రముఖ నాయకుడి చేరికతో మహారాష్ట్రలోని ఖాందేష్‌ ప్రాంతంలో తమ పార్టీ(ఎన్సీపీ) మరింత బలోపేతం అవుతుం దని జయంత్‌ పాటిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖడ్సేతోపాటు ఎంతోమంది బీజేపీలో ఎమ్మెల్యేలు ఎన్సీపీలో చేరేందుకు అసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం చాలా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతుందని జయంత్‌ తేల్చిచెప్పారు. ఏక్‌నాథ్‌ ఖడ్సే నిర్ణయంపై బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్పందించారు. ఖడ్సే రాజీనామాను ఊహించలేదన్నారు. ఖడ్సే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోతుండడం తమకు ఒక చేదు నిజం అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా