కేసీఆర్, హరీశ్‌లు నాపై పోటీ చేయగలరా?

5 Sep, 2021 04:44 IST|Sakshi
జమ్మికుంటలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ 

విశ్వకర్మల ఆత్మీయ సత్కారసభలో ఈటల సవాల్‌ 

జమ్మికుంట: హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్‌గానీ, మంత్రి హరీశ్‌రావుగానీ తనపై పోటీ చేయగలరా అని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యానికి చరమగీతం తప్పదని హెచ్చరించారు. జమ్మికుంటలో శనివారం జరిగిన జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి విశ్వకర్మల ఆత్మీ  య సత్కార సభలో ఈటల పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ లేదని, బానిసలుగా ఉండాల్సిందేనని, తాను మం త్రిగా ఉన్నప్పుడు కూడా తాళంచెవి ఆయన చేతిలోనే ఉండేదని ఆరోపించారు. ‘మీరు మంత్రులే అయితే.. మీ నియోజకవర్గాల్లో పింఛన్లు ఇప్పించండి’అంటూ సవాల్‌ విసిరారు.

సీఎం కేసీఆర్‌ పేదల పక్షాన లేరని, అక్రమ సంపాదనలో ఆయన పూర్తిగా మునిగిపోయి ఉన్నోళ్లకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆర్థికమంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు ఒక్క బిల్లు ఇచ్చే అధికారమైనా ఉందా అని నిలదీశారు. కంపెనీ నగలు వచ్చిన తర్వాత కంసాలివృత్తి మాయమైందని, కులవృత్తులు లేవని ఉద్యోగం చేద్దామనుకుంటే ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 కోట్లు బడ్జెట్‌ పెట్టినా..కులవృత్తులకు ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు