అగ్గి పెడతా.. కేసీఆర్‌ పార్టీని కూల్చేస్తా

11 Oct, 2021 01:58 IST|Sakshi
మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌   

సాక్షి, కమలాపూర్‌ (వరంగల్‌): తాను ఒక్క హుజూరాబాద్‌తోనే కొట్లాట ఆపనని, ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అగ్గి పెట్టి.. కేసీఆర్‌ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు తన పేరిట నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారని, దళితబంధు వద్దు.. అని సృష్టించిన లేఖపై ఎన్నికల కమిషన్, టీఆర్‌ఎస్‌ చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. అలాగే తాను కేసీఆర్‌కు భయపడి వాళ్ల కాళ్ల మీద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లు మరో దొంగ లేఖ పుట్టించారని, తాను చచ్చినా ఎవరి ముందు మోకరిళ్లనని స్పష్టంచేశారు. గతంలో గ్యాంగ్‌స్టర్‌ నయీం చంపిస్తానంటేనే బెదిరిపోలేదని, ఇప్పుడు కూడా కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడబోనని పేర్కొన్నారు.

‘కేసీఆర్‌! నువ్వు కాదు కదా.. నీ జేజమ్మ వచ్చినా ఇక్కడ గెలవలేరు. ఇక్కడ ఉన్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు పద్దెనిమిదిన్నర ఏళ్లుగా నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నోళ్లు.. నీ సారా సీసాలకు, డబ్బు సంచులకు లొంగిపోరు, బెదిరింపులకు, నీ పోలీసు రాజ్యానికి భయపడరు. ఇది చైతన్యవంతమైన హుజూరాబాద్‌’అని అన్నారు.

కేసీఆర్‌ కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ఈ నెల 30న హుజూరాబాద్‌ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ఈటల మోసానికి.. గెల్లు విధేయతకు మధ్య పోటీ


 

మరిన్ని వార్తలు