Karnataka: సొంత ప్రభుత్వాన్ని ఏకిపారేసిన బీజేపీ సీనియర్‌ నేత

28 Mar, 2022 21:24 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్‌ వివాదం తరువాత  హిందు దేవాలయ ప్రాంగణంలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ రైట్‌ వింగ్‌ సంస్థలు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విశ్వనాథ్‌ ఆరోపించారు. ప్రభుత్వం తప్పక స్టాండ్‌ తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై అభ్యంతరాలను ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో చర్చించినట్లు తెలిపారు. కాగా 2019లో కాంగ్రెస్ జేడీఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినవారిలో విశ్వనాథ్‌ ఒకరు.
చదవండి: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం

‘ఇతర దేశాలలో కూడా ముస్లింలు నివసిస్తున్నారు. అక్కడ వారు ఆహారం, పువ్వులు అమ్ముతుంటారు.. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే వాళ్ల నుంచి ఏం తీసుకుకోకుండా ఉంటామా? వీళ్లంతా చిరు వ్యాపారులు, కాలే కడుపు కోసం పనిచేసుకునే వారు. వారికి  మతాల పట్టింపు లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం. మత సంస్థ కాదు’ అని ఎమ్మెల్సీ విశ్వనాథ్‌ నొక్కి చెప్పారు. అయితే రాష్ట్రం రైట్ వింగ్ ఒత్తిడికి లొంగిపోతోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
చదవండి: బెంగాల్‌ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు