కాళేశ్వరంతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు

23 Oct, 2023 04:57 IST|Sakshi
రాజాసింగ్‌ను ఆలింగనం చేసుకున్న కిషన్‌రెడ్డి

మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోవడం ఇంజనీరింగ్‌ అద్భుతమా?: కిషన్‌రెడ్డి 

దీనిపై ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు 

సీఎం కేసీఆర్‌ తానే ఇంజనీరునని,తానే డిజైన్‌ చేశానని చెప్పారు 

డ్యాం సేఫ్టీ అథారిటీని రప్పించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద చిల్లుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈరోజు ఆ అనుమానాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు.

కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఈటల రాజేందర్‌ నేతృత్వంలో బీజేపీ బృందం వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజాసింగ్‌లతో కలసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ఇంజనీరింగ్‌ మార్వెల్‌ అని కేసీఆర్‌ జబ్బలు చరచుకున్నారు. మూడేళ్లలో ప్రాజె క్టు కుంగడం నిజంగా ఇంజనీరింగ్‌ అద్భు తమే. కేసీఆర్‌ 80వేల పుస్తకాలు చదివి, సూపర్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి, ఇంజనీరింగ్‌ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు.

అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపుహౌజ్‌లు మునిగి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతోంది. లోపాలన్నీ బయటపడుతున్నాయి’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఏటా 400 టీఎంసీలు ఎత్తిపోసి రైతులకు ఇస్తామన్న కేసీఆర్‌.. గత నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై తక్షణమే డ్యామ్‌ సేఫ్టీ అథారిటీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. 

దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా 
ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశామని కిషన్‌రెడ్డి చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదలవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాని 5 సభల్లో, అమిత్‌ షా 3 సభల్లో పాల్గొన్నారని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులూ పర్యటించారని తెలిపారు. 27న మరోసారి రాష్ట్రానికి అమిత్‌షా రానున్నారని, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటిస్తారని వెల్లడించారు.

దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకుంటామని చెప్పారు. నేతలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటర్‌ను కలిసేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కొన్నిరోజులుగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పాలక పార్టీ ఒత్తిడికి అధికారులు తలొగ్గవద్దని కోరారు.   

మరిన్ని వార్తలు