ఆ 125 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో..

21 Sep, 2020 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంలో ఉన్నాయని, దళారీలు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ముకాసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు కారణమవుతోన్న పత్తి పంటను కేసీఆర్ ప్రోత్సహించటం సరైంది కాదన్నారు. 40 లక్షల ఎకరాల పత్తి పంటను సీఎం కేసీఆర్ 70 లక్షల ఎకరాలకు తీసుకెళ్లారని, భూసార పరీక్షల కోసం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 125 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్‌‌ వ్యూహమేంటి?)

రైతులను దోచుకోవటానికున్న రాజమార్గం మూసుకుపోతోందని టీఆర్ఎస్‌కు బాధగా ఉందన్నారు. వ్యవసాయ చట్టంతో రైతుల ఆదాయం రెట్టింపవుతోందని పేర్కొన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌పై ప్రతిపక్ష ఎంపీల దాడిని ఖండిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన ఎంపీల తీరు బాధాకరమన్నారు. కొత్త వ్యవసాయ చట్టంతో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని, దేశ భవిష్యత్‌కు వ్యవసాయ చట్టం పునాది లాంటిదని వ్యాఖ్యానించారు. రైతు తనకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు