చంద్రబాబు ఆంధ్రాలో తిరుగుతారు.. హైదరాబాద్‌లో నిద్రపోతారు

28 Dec, 2022 05:25 IST|Sakshi

రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వంలో రూ.7 వేల కోట్లు ఇచ్చినా ఏమీ జరగలేదు

దళితుల అభివృద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లిచ్చింది

డబ్బులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివా!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

గుంటూరు (వెస్ట్‌): ప్రతిపక్ష నేత చంద్రబాబు పగలు ఆంధ్రాలో తిరుగుతూ.. రాత్రికి మాత్రం హైదరాబాద్‌ వెళ్లి నిద్రపోతుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో తొలగించిన 26 పథకాలు అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల నిరసన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క భవనం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారని విమర్శించారు. 2014 నుంచి దళితుల అభివృద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. జాతీయ ఎస్సీ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా దళితులకు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలిచ్చే పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు.

ఇందులో 50 శాతం సబ్సిడీని కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని నీరు గార్చేశారని ఆరోపించారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న లక్ష బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీని చేయకుండా దళితులపై సీఎం జగన్‌ చిన్నచూపు చూస్తున్నార­న్నారు. కేంద్రం మన రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, రూ.65 వేల కోట్లతో రోడ్లు నిర్మించిందని చెప్పారు. అయితే డబ్బులు కేంద్రానివి..  స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివి అన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నా­రన్నారు.

కుటుంబ పాలన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసత్యాలను ప్రచారం చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టేశారని విమర్శించారు. ఓట్లకోసం సంక్షేమ బాటపట్టిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, మాగంటి సుధాకర్‌ యాదవ్, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు