బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్

17 Jan, 2021 18:58 IST|Sakshi

ఆలయ బలిపీఠం తొలగిస్తున్నారంటూ దుష్ప్రచారం

అనంతపురం: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరతీశారు. రోడ్ల విస్తరణలో భాగంగా అనంతపురం జిల్లాలోని కదిరి లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగిస్తున్నారంటూ తప్పుడు ట్వీట్‌ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని అనంతపురం జిల్లా ఇంఛార్జ్‌ కలెక్టర్ డా.సిరి ఖండించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగించే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. బలిపీఠంపై బీజేపీ నేత చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. 

మరోసారి తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరి హెచ్చరించారు. తప్పుడు వార్తల ప్రచారం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆమె‌ హెచ్చరించారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసులు కూడా నమోదు చేసి, దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ నేతలను అరెస్టు చేశామని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇదివరకే ప్రకటించారు.
(చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర)

మరిన్ని వార్తలు