శశికళ ప్రతినిధిని ఢిల్లీకి పిలిపించిన బీజేపీ పెద్దలు

22 Sep, 2020 06:45 IST|Sakshi

ఢిల్లీలో దినకరన్‌ బిజీ

2021 ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే బలాన్ని పెంచేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ వెళ్లిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ రహస్యంగా బీజేపీ నేతలను కలిసినట్టుగా వస్తున్న ప్రచారం కొత్త చర్చకు దారి తీసింది. 

సాక్షి, చెన్నై: దివంగత జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. పన్నీరు, పళని నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఓ వైపు, జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌ నేతృత్వంలోని అమ్మా మక్కల్‌ మునేట్ర కళగం మరో వైపు అన్నట్టుగా ఓటు బ్యాంక్, సభ్యత్వం ముక్కలైంది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ శశికల జనవరిలో విడుదల కాగానే రాజకీయ పరిణామాలు తమిళనాట అనూహ్యంగా మారుతాయన్న చర్చ జోరందుకుంది.

ఇదే జరిగిన పక్షంలో అన్నాడీఎంకేకు తీవ్ర నష్టం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ హఠాత్తుగా ప్రత్యేక విమానంలో మిత్రుడు, సహాయకుడితో కలిసి ఆదివారం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నమ్మ విడుదల విషయంగా ఢిల్లీలోని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులను కలిసేందుకు దినకరన్‌ వెళ్లినట్టు ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి.  (జనవరి 27న శశికళ విడుదల!)

ఢిల్లీ పెద్దల పంచాయితీ.. 
2021 ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించే అవకాశం ఉందని వచ్చిన సర్వేల నేపథ్యంలో బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టారు. అందుకే దినకరన్‌ను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగానే  ఢిల్లీలో తిష్ట వేసిన దినకరన్‌ అక్కడి పెద్దలతో రహస్య భేటీల తదుపరి పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఢిల్లీ పెద్దల పంచాయితీ విషయాన్ని చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే దినకరన్‌ పర్యటన ఉండబోతోందని అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.  (200 సీట్లే లక్ష్యం!: డీఎంకే మిత్రుల్లో కలవరం)

అన్నాడీఎంకేతో కూటమి కొనసాగుతుందని, ఇది మరింత బలాన్ని పుంజుకోనున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంద ని, దానిని భర్తీ చేయడానికి తగ్గట్టుగా ఆ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దిండుగల్‌కు చెందిన సూర్యమూర్తి పిటిష న్‌ వేయడంతో రాజకీయ  ఆసక్తి పెరిగింది.

మరిన్ని వార్తలు