అంధకారంలో టీడీపీ భవిష్యత్‌

18 Nov, 2022 03:27 IST|Sakshi

అందుకే చంద్రబాబులో అభద్రతా భావం  

బీజేపీ–జనసేనే భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి ప్రత్యామ్నాయం 

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు 

పవన్‌ మాతోనే ఉంటాడు.. ఉండాలి: సోము వీర్రాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. అందుకే చంద్రబాబు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. జనసేన, బీజేపీతోనే కొనసాగుతుందని క్లారిటీ రావడంతో చంద్రబాబు నిరాశ, భయంతో వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘తాను తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే, తన సినిమానే ఆడుతుందని చంద్రబాబు భావించాడు.

ఇతరులు రంగంలో లేకుండా టీడీపీతో కలుపుకోవాలని ఆలోచించాడు. అది ఫలించ లేదు. అలా వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు వేసిన పాచిక పారలేదు. కచ్చితంగా భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ–జనసేన ఎదుగుతుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బీజేపీతోనే కలిసి పోటీ చేయాలని తమ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

‘జనసేన బీజేపీతోనే కలిసి పోటీ చేస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ మాతోనే ఉంటారు. ఉండాలి. కుటుంబ పార్టీ టీడీపీతో కలవొద్దని కేంద్ర పార్టీ నుంచి పవన్‌కు స్పష్టంగా ఆదేశాలు అందాయి. టీడీపీతో కలిసేది లేదని పవన్‌ కళ్యాణ్‌కు ఢిల్లీ పెద్దలు చెప్పారు. కుటుంబ రాజకీయాలకు మేం వ్యతిరేకం. పవన్‌ కళ్యాణ్‌ మాతోనే ఉండేలా ఒప్పిస్తాం. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం’ అని స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు