సోనార్‌ బంగ్లా నిర్మిస్తాం: అమిత్‌షా

22 Mar, 2021 05:32 IST|Sakshi

ఇంటికో ఉద్యోగం, సీఏఏ అమలు 

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన  హోం మంత్రి అమిత్‌ షా

కోల్‌కతా:  తాము అధికారంలోకి వస్తే సోనార్‌ బంగ్లా(బంగారుబెంగాల్‌) నిర్మిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని, పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మేనిఫెస్టో ‘సోనాల్‌ బంగ్లా సంకల్ప పత్ర’ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం కోల్‌కతాలో విడుదల చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సామాజిక భద్రత పథకాలను బలోపేతం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

సీఏఏ అమలుపై కొత్త ప్రభుత్వంలో తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్‌ భారత్, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి వంటి వాటిని బెంగాల్‌లో అమల్లోకి తీసుకొస్తామని అమిత్‌ షా ఉద్ఘాటించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింది రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులకు రూ.18 వేల చొప్పున ఏరియర్స్‌ ఇస్తామన్నారు. రైతుల ఆర్థిక భద్రత కోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సన్నకారు రైతులకు, మత్స్యకారులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు.

నోబెల్‌ బహుమతి తరహాలో కళలు, సాహిత్యంలో లబ్ధప్రతిష్టులకు టాగూర్‌ బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లతో సోనార్‌ బంగ్లా నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు కేజీ నుంచి పీజీ దాకా విద్యనందిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అలాగే విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లతో ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా పేర్కొన్నారు. సోనార్‌ బంగ్లా నిర్మించడానికి తమకు ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు