‘ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా నిప్పు కణికలు అవుతారు?’

5 Nov, 2022 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ దుయ్యబట్టారు. తానే ఒక రాజు, చక్రవర్తిలా తెలంగాణను  ఏలుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశం అధోగతి పాలవుతుందని చెబుతూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెల్లడించిన బాధ స్వయంగా తాము రాష్ట్రంలో అనుభవిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. 

2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని ఈటల రాజేందర్‌ సవాల్ విసిరారు. కొనుగోలు కేసులోని ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా నిప్పు కణికలు అవుతారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  2018లో టీఆర్‌ఎస్‌కు 90 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మానవత్వం లేకుండా కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఈటల రాజేందర్‌ విమర్శించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు అభివృద్ది జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజాం కాదా అని ప్రశ్నించారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు.

‘కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం, మర్యాద మాకు ఉండేది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజక వర్గానికి మంత్రులు వచ్చిన సమాచారం ఇచ్చి, అడిగిన పనులు చేసేవారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే పలు టీవీ ఛానెల్స్ మీడియా మీద ఆంక్షలు విధించింది మీరు కాదా?. పెద్ద పెద్ద టీవీ ఛానెల్స్‌ను బెదిరించి లోంగదిసుకుంటున్నారు. మీ అహంకారం, దుర్మార్గాలకు ఇవే నిదర్శనం. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల‌ కమిషన్ విఫలమైంది. ఓటమి భయంతోనే మునుగోడులో టీఆర్ఎస్ హింసను ప్రేరేపించింది. హుజూరాబాద్‌లో  ఏం జరిగిందో మునుగోడులో అదే రిపీట్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు