కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు 

27 Jul, 2022 03:00 IST|Sakshi

బీజేపీ నేత ఈటల సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌లో పోటీ చేస్తా.. సిద్ధమా? అని తాను సవాలు విసిరితే దానిని స్వీకరించకుండా సీఎం కేసీఆర్‌ బానిసలతో అవమానకరంగా తిట్టిస్తున్నారని, కేసీఆర్‌ను ఓడించకపోతే తన జీవితానికి సార్ధకతే లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే హుజూరాబాద్‌ గడ్డ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

చెన్నూరు ఎమ్మెల్యే ఇతరులను అవమానించడం తప్ప, తన జాతి గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల అసైన్డ్‌ భూములను గుంజుకుంటూ కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లాగా మారారన్నారు. కేసీఆర్‌ దృష్టిలో బానిసలే లీడర్లని, ఆత్మాభిమానం ఉన్న వాళ్లు కాదని స్పష్టంచేశారు.

ఆత్మగౌరవం ఉన్న మనిషిగా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానన్నారు. తనకు శత్రువులెవరూ లేరని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని మిత్రులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానని టీఆర్‌ఎస్‌లో చేరలేదని, తన ఉద్యమ పటిమ చూసి 2004లో ఎమ్మెల్యేగా చాన్సిచ్చారని, ఇప్పటికీ ఓటమి ఎరగలేదన్నారు. పార్టీలో నుంచి అందరు వెళ్లిపోతున్నా కేసీఆర్‌ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు