అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటదా?: ఈటల

10 Nov, 2022 18:46 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీరుపై మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రధానమంత్రిని అవమాన పరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పారిపోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోని సీఎం కేసీఆర్ ఒక్కడేనని ధ్వజమెత్తారు. కారు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పరామర్శించిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.‌ 

సొంత పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. చివరకు గవర్నర్ ఫోన్‌ని టాపింగ్ చేస్తున్నారంటే అంతకంటే దుర్మార్గం ఏమిలేదన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోనే అవకాశం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటలు చూసి తెలంగాణ ప్రజలు కుంగిపోతున్నారని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువుల అందించాలని మోడీ చూస్తూంటే.. కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

సీపీఎం, సీపీఐ పార్టీలను, పలు సంఘాలను రెచ్చగొట్టి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం సరికాదన్నారు. సింగరేణి బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ మాయలో పడి సింగరేణి కార్మకులు నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఈనెల 12న రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి వస్తున్నారని, మోదీ టూర్ విజయవంతం చేయాలని కోరారు.

చదవండి: ('ఆయనేమో తడిబట్టలతో తిరుగుతాడు.. వీళ్లేమో కోర్టుకు.. ఎందుకంత భయం?')

మరిన్ని వార్తలు