గ్రేటర్‌ ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికలు: రఘునందన్‌రావు

16 Nov, 2020 16:10 IST|Sakshi

గ్రేటర్ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసు​కుంది

మేయర్‌ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టడానికి కుట్రలు

టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్టే

టీఆర్ఎస్‌ను ఓడింవచ్చని దుబ్బాక నిరూపించింది

సిద్ధిపేటతో సమానంగా దుబ్బాకకు నిధులు తెస్తా

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ని ఎదుర్కొవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంఐఎంను మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ సోమవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్’‌లో రఘునందన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం’ అన్నారు రఘునందన్‌ రావు. (చదవండి: సంక్రాంతికి ‘జీహెచ్‌ఎంసీ’ గిఫ్ట్‌ ఇస్తారు..)

ఆయన మాట్లాడుతూ.. ‘వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలుగా మార్చింది. జోనల్ కమిషనర్‌కు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం. టీఆర్ఎస్‌లో అవమానాలు ఎదుర్కొంటోన్నఅసలసిసలైన ఉద్యమకారులను బీజేపీ గౌరవిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఓడింవచ్చన్న స్పూర్తిని దుబ్బాక ఇచ్చింది. బీజేపీని.. రఘునందనరావును వేరుచేసి చూడవద్దని మనవి చేస్తున్నాను. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖమంత్రి కాదు. సిద్ధిపేటతో సమానంగా కోట్లాడి దుబ్బాకకు నిధులు తీసుకెళ్తాను. గ్రామీణ ప్రాంతం కాబట్టే కేంద్ర నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. ఇకపై ప్రతి ఎన్నికలోనూ బీజేపీనే గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తాను. దుబ్బాక బస్టాండ్ నిధులను గోల్ మాల్  వ్యవహారం త్వరలో బయటకు వస్తుంది అన్నారు రఘునందన్‌ రావు.

మరిన్ని వార్తలు