ఓఆర్‌ఆర్‌ టెండర్‌.. ఐఆర్‌బీ డెవలపర్స్‌పై రఘునందన్‌ రావు సంచలన ఆరోపణలు

25 May, 2023 18:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్‌ఆర్‌ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్‌బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు.

ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు  విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

ఐఆర్‌బీ డెవలపర్స్‌  సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌గేట్‌ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 
(చదవండి: ప్రైవేటుకు ఓఆర్‌ఆర్‌!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్‌ సర్కార్‌)

'ఓఆర్ఆర్‌ టెండర్‌ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. 
 
ఇటీవల ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలపర్స్‌ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్‌లో భారీ స్కామ్‌ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్‌బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
(చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు)

మరిన్ని వార్తలు