మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్‌ రావు

23 Nov, 2022 12:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని అన్నారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కాదని హితవు పలికారు. 

మల్లారెడ్డి కొడుకు అస్వస్థతకు గురవ్వడంపై ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ అసుపత్రికి వెళుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఉదయం కూడా వాకింగ్‌ చేశరు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ధ్వజమెత్తారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు.
సంబంధిత వార్త: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే..

మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని విమర్శించాఉ.

మల్లారెడ్డి ఫైర్‌
మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మంత్రిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తరువాత తిరిగి ఇంటికి వెళ్లారు. తన కొడుకును సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు జరుపుతోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు