మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేయాలి 

15 Aug, 2022 01:35 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తన వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్‌వో) నుంచి తుపాకీ తీసుకొని గాలిలోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి అరె­స్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్‌నగర్‌లో మంత్రి కాల్పులు జరిపారో జిల్లా ఎస్పీ, డీజీపీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఆదివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వేలాది మంది హాజరైన ర్యాలీని ప్రారంభించేందుకు మంత్రి తుపాకీ తీసి కాల్చడమేమిటని రఘునందన్‌ ప్రశ్నించారు. తాను కాల్చింది రబ్బర్‌ బుల్లెట్లు అని మంత్రి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భద్రతా సిబ్బంది వద్ద రబ్బర్‌ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలంతా ఆలోచించుకోవాలని, తమకు భద్రతగా ఉన్న గన్‌మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్‌ బుల్లెట్లా? అసలు బుల్లెట్లా? తెలియాలని అన్నారు.

మంత్రి కాల్పుల ఘటనను పక్కదారి పట్టించేందుకు జిల్లా ఎస్పీ, తానే మంత్రికి తుపాకీ ఇచ్చినట్లు చెపుతున్నారని, ఏ చట్టం ప్రకారం పోలీసు తుపాకీని ఎస్పీ ఇలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ‘ఎస్పీ సమక్షంలో తుపాకీ పేలిస్తే దాన్ని ఇప్పటి వరకు సీజ్‌ చేయలేదు. మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశమున్నా కేసు పెట్టలేదు. ఆ తుపాకీని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపలేదు’అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు డీజీపీ కార్యాలయానికి గానీ ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు కానీ సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు రమ్మంటారో చెప్పాలన్నారు. 

మరిన్ని వార్తలు