ఆ తప్పులు తహసీల్దార్లు చేయరా?: రాజా సింగ్‌

12 Sep, 2020 04:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లపై భారం వేయడం ఎంత వరకు సమంజసం. వీఆర్వోలే కాదు తహసీల్దార్లు కూడా అవినీతి దుకాణం తెరిచారు. కొంతమంది వీఆర్వోలు చేసిన తప్పులకు వీఆర్వోలందరిపై అవినీతి ముద్ర వేయడం సరికాదు. వీఆర్వోలు చేసిన తప్పులనే తహసీల్దార్లు చేయరని గ్యారెంటీ ఏంటి? తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు కూడా ఏసీబీకి పట్టుబడుతున్నారు కదా. అధికారులను కాదు, వ్యవస్థను మార్చాలి. రైతుల నుంచి డబ్బులు అడిగే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. వ్యవసాయ భూముల సర్వే చేస్తాం అని సీఎం ప్రకటించారు. దేవాదాయ, ల్యాండ్‌ సీలింగ్, అసైన్డ్‌ భూములను కూడా సర్వే చేస్తారా?’అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా బిల్లుకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు.  

న్యాయపర చిక్కులు రాకుండా చూడాలి: శ్రీధర్‌బాబు 
కొత్త రెవెన్యూ చట్టం అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. చట్టంలో పలు మార్పులను సూచించారు. 8లక్షల ఎకరాల పట్టా భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిందని, వీటిపై నిర్ణయం తీసుకోవాలని.. సర్వే, సెటిల్మెంట్‌ తర్వాతే మ్యుటేషన్‌ చేయాలని స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు