ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్‌

26 Sep, 2023 08:20 IST|Sakshi

సాక్షి, అబిడ్స్‌ (హైదరాబాద్‌): మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దమ్ముంటే గో షామహల్‌ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ.. మజ్లిస్‌ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు.

కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్‌ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్‌లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తానని రాజాసింగ్‌ ధీమా వ్యక్తంచేశారు.  

తాంత్రిక పూజల్లో కేసీఆర్‌ సిద్ధహస్తుడు 
కరీంనగర్‌ టౌన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్‌ మొక్క నాటారు.

అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్‌కు ఏటీఎం మిషన్‌ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడం ఖాయమన్నారు. 

మరిన్ని వార్తలు