ఆపరేషన్‌ ఆకర్ష్‌ అక్కడ విఫలం.. బీజేపీ ఎమ్మెల్యేలే జంప్‌ కొడతారా?

26 Jul, 2022 08:20 IST|Sakshi

వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం బీజేపీకే భారీ షాక్‌ తప్పేలా కనిపించడం లేదు. 

రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ తాజా ప్రకటన బీజేపీలో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో ‘టచ్‌’లో ఉన్నారంటూ జార్ఖండ్‌ ముక్తి మోర్చా అనూహ్య ప్రకటన చేసింది. యూపీఏ మిత్రపక్షం అయినప్పటికీ.. జేఎంఎం మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే మద్ధతు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాంటిది.. 

సుమారు పదహారు మంది బీజేపీ ఎమ్మెల్యేలు జేఎంఎంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ ఆకర్ష్‌.. ఇక్కడ వర్కవుట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే వాళ్లు(16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు) తమ పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్లంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. అవసరం అయితే బీజేపీ నుంచి చీలిపోయి.. ఒక గ్రూపుగా ఏర్పడి జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని సుప్రియో పేర్కొన్నారు.

ప్రస్తుతం జేఎంఎం ప్రభుత్వ పాలన స్థిరంగానే కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం 30, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెల్చుకుంది. అలాగే బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. యూపీఏ కూటమితోనే జేఎంఎం ప్రభుత్వం నడుస్తోంది అక్కడ.

అయితే.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌పై అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో జేఎంఎం.. బీజేపీ నుంచే తమవైపు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించడం కొసమెరుపు. 

ఇదిలా ఉంటే జేఎంఎం ప్రకటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. అవినీతిలో కూరుకుపోయిన జేఎంఎం.. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసని, ప్రజావ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జేఎంఎంతో పాటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలసలు తప్పవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ సహదేవ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు