సీపీని సస్పెండ్‌ చేయాలి: బండి సంజయ్‌

27 Oct, 2020 08:34 IST|Sakshi

దీక్ష ​కొనసాగిస్తున్న ఎంపీ బండి సంజయ్‌

ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ, బీజేవైఎం పిలుపు

భారీగా పోలీసుల మోహరింపు

సాక్షి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసుల వ్యవహార శైలి గురించి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుపు తథ్యమని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. (చదవండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌)

సిద్దిపేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన వారి బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్‌ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతి భవన్‌ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు