హైదరాబాద్‌ గొప్పలు కాదు.. ఏపీకి ఏం చేశారో చెప్పండి!

25 Dec, 2022 11:20 IST|Sakshi

అధికారం పోగానే హైదరాబాద్‌ ఎందుకు వెళ్లిపోయావు

తెలంగాణలోనే మీరు రాజకీయాలు చేసుకోండి

చంద్రబాబు తీరును తప్పుపట్టిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌

సాక్షి, అమరావతి: ‘హైదరాబాద్‌కు అది తెచ్చాం, ఇది తెచ్చామని గొప్పులు చెప్పుకోవడం కాదు.. మీరు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రకు ఏం తెచ్చారో చెప్పండి.. కేంద్రం ఇచ్చిన సంస్థలు కాకుండా మీరేమి తెచ్చారో చెప్పండి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సూటిగా ప్రశ్నించారు. పార్టీ సహచరులతో కలిసి శనివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ‘అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్‌ ఎందుకు వెళ్లిపోయారు. ఏపీ అభివృద్ధిపట్ల శ్రద్ధలేదా.. అధికారం కావాలంటే ఆంధ్రా జనాన్ని వాడుకోవాలి.. అది అయిపోయాక హైదరాబాద్‌లో మీ ఆస్తులను పెంపొందించుకోవాలి. ఇదేనా మీ ఆలోచన. మీకు మీ ప్రాంతంపట్ల చిత్తశుద్ధిలేదు.

హైదరాబాద్‌లో సొంత ఆస్తులు ఉన్నాయనే, సొంత వ్యాపారాలు ఉన్నాయనే, బలగం ఉందనో మీరు అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. మీకు హైదరాబాద్‌కు ఏం సంబంధం.. మీరు తెలంగాణలో రాజకీయాలు చేసుకోండి..’ అంటూ జీవీఎల్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పాలని, ఐటీ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఈ తరుణంలో ఐటీ కంపెనీలకు రాయితీలిస్తే, వాటి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేసే అవకాశముంటుందని జీవిఎల్‌ సూచించారు.    

చదవండి: (ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్‌)

మరిన్ని వార్తలు