కాంగ్రెస్‌ సంక్షోభానికి బీజేపీయే కారణం: జీవీఎల్‌

24 Aug, 2020 18:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి బీజేపీయే కారణమని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాదరణ పొందడం కారణంగానే కాంగ్రెస్ పతనానికి చేరుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పార్టీలో యువ నాయకత్వం తీవ్ర నిరాశతో ఉంది. జ్యోతిరాదిత్య సింథియా పార్టీ వీడి వచ్చారు. సచిన్ పైలట్ దాదాపు వీడే వరకు వచ్చారు. కుటుంబ పార్టీల్లో ఈ తరహా పరిస్థితి ఎప్పటికైనా తప్పదు. ప్రజలు సైతం కేవలం రాజకీయాలు చేసే పార్టీల వైఖరితో విసిగిపోయి ఉన్నారు. చైనా విషయంలో ఆర్మీ స్థైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు విస్మరించరు. తెలంగాణలో కాంగ్రెస్‌ కొంత మేర ఉన్నా, ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో సైతం జాతీయస్థాయిలో ఎదుర్కొంటున్న పతనావస్థకు చేరుకుంది. ( జీవీఎల్‌పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు )

అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. కాంగ్రెస్ తరహాలోనే టీడీపీ కూడా అలాగే ఉంది. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. టీడీపీకి ఇంకో మైనస్ పాయింట్ అధికారంలో లేకపోవడం, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడమే. ప్రజలు ప్రతిభ, సమర్ధత కోరుకుంటున్నారు. కుటుంబాలకు చెందిన వ్యక్తులను కాదు. తెలుగుదేశం పార్టీని అభిమానించే పత్రికాధినేతలు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలను కూడా ‘మీ రాహుల్ మీ ఇష్టం ...మీ లోకేష్ మీ ఇష్టం’ అంటారో లేదో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడిందని సామాన్య కార్యకర్తలకు అర్థం అయింది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు