కాకతీయ ప్రాంగణంలో నేటి నుంచే ‘కాషాయ’ పండుగ 

1 Jul, 2022 01:19 IST|Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి సర్వం సిద్ధం 

హెచ్‌ఐసీసీలో నేటి నుంచే కార్యక్రమాలు 

నేడే హైదరాబాద్‌కు చేరుకోనున్న జేపీ నడ్డా 

శంషాబాద్‌ నుంచి నోవాటెల్‌ వరకు భారీ ర్యాలీ

సాయంత్రం పార్టీ జాతీయ కార్యదర్శుల భేటీ..

2న ఉదయం పదాధికారుల భేటీ..

మధ్యాహ్నం 3 గంటలకు కార్యవర్గ భేటీ షురూ 

శనివారమే ప్రధాని మోదీ రాక.. భేటీకి హాజరు 

3న సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగసభ 

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ ‘జాతీయ పండుగ’ శుక్రవారం అంగరంగ వైభవంగా మొదలుకానుంది. సోమవారం దాకా జరగనున్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం సర్వం సన్నద్ధమైంది. భేటీ కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు రాష్ట్రానికి చేరుకోగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు నేతలు శుక్రవారం రానున్నారు. జేపీ నడ్డాకు శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నాయి. నడ్డా అక్కడి నుంచి భారీ ర్యాలీగా హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకోనున్నారు.

తొలుత తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలు, కళలు, చరిత్రకు అద్దంపట్టేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. తర్వాత నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీ జరగనుంది. అందులో కార్యవర్గ సమావేశాల ఎజెండాపై చర్చిస్తారు. 2న (శనివారం) ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహించి.. తీర్మానాలు, ఎజెండాను ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ కార్యవర్గ భేటీ ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు సాగుతుంది. 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యవర్గ భేటీ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘విజయ సంకల్ప సభ’ బహిరంగ సభలో ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. 

సమావేశ మందిరాలకు చారిత్రక పేర్లతో.. 
జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్‌ ప్రాంతానికి శాతవాహన నగరంగా, జాతీయ కార్యవర్గ సమావేశ స్థలికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు ఆఫీస్‌గా పేరు ఖరారు చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా.. మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్‌ హల్‌గా.. అతిథులు బసచేసే ప్రాంగణానికి సమ్మక్క–సారలమ్మ నిలయంగా.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబింగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనశాలకు గొల్లకొండగా పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ భేటీ తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్‌ పేరును ఖరారుచేశారు. 4వ తేదీన బీజేపీ సంఘటన కార్యదర్శుల (అన్ని రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల) సమావేశ హల్‌కు కొమురం భీం పేరు పెట్టారు. 

ప్రధాని షెడ్యూల్‌ ఇదీ 
ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 2న (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకునే ప్రధాని.. నాలుగో తేదీన తిరిగి బయలుదేరనున్నారు. ప్రధాని షెడ్యూల్‌లో ముఖ్య కార్యక్రమాలతోపాటు రోజూ కొంత సమయాన్ని రిజర్వుగా ఉంచారు. ఆ సమయంలో పార్టీ నేతలతో భేటీలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయనున్నారు.  

జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇంద్రసేనారెడ్డి 
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఆయన చేరికతో రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, మురళీధర్‌రావు, డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజాసింగ్, మంత్రి శ్రీనివాస్‌ జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. 
 
ఏర్పాట్లలో లోటు రావొద్దు 
– ప్రధాని పర్యటనపై అధికారులకు సీఎస్‌ ఆదేశం 
బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కోసం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. మూడు రోజులు ఇక్కడే ఉండనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్షించారు. ప్రధాని 2న హైదరాబాద్‌కు చేరుకుని 4న ఉదయం బయలుదేరి వెళతారని.. ఇతర వీఐపీలూ పర్యటించనుండటంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. 

కార్యవర్గ భేటీ ఏర్పాట్లు దాదాపు పూర్తి 
హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌):  బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. శుక్రవారం నుంచే సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీతోపాటు అతిథులు బస చేసే నోవాటెల్‌ ప్రాంగణం ఇతర ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం పరిశీలించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ తాత్కాలిక కార్యాలయం, కేంద్ర మంత్రులు, ఇతర వీఐపీలకు స్వాగతానికి ఏర్పాట్లు, కావలసిన వసతులు, ప్రచార రథం, నోవాటెల్‌ ఎదురుగా ప్రత్యేక షెడ్‌లో ఎగ్జిబిషన్‌ తదితర అంశాలను పరిశీలించారు.

రాష్ట్ర బీజేపీ కోరిక మేరకు జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోందని ఈ సందర్భంగా బండి సంజయ్‌ తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, 18 మంది సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ సీనియర్లు రానుండటంతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు