JP Nadda: కేసీఆర్‌కూ నిజాం గతే

28 Aug, 2022 08:17 IST|Sakshi

అప్పట్లో నిజాం జనసభలు వద్దన్నాడు.. ఇప్పుడు కేసీఆర్‌ సభలు పెట్టొద్దంటున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారింది 

ప్రజాస్వామ్యాన్ని బందీ చేశారు 

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామని వ్యాఖ్య 

అరెస్టులు, దాడులతో పాదయాత్రను ఆపలేరు: బండి సంజయ్‌ 

సెప్టెంబర్‌ 12 నుంచి 4వ విడత యాత్ర 

సాక్షి, వరంగల్‌: ‘‘సీఎం కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో నిజాం జనసభలు పెట్టుకోవద్దని ఫర్మానా జారీ చేశాడు. అదే ఆయనకు చివరి ఫర్మానా అయింది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా సభలు పెట్టుకోవద్దంటూ ఫర్మానాలు జారీ చేస్తున్నారు. ఈయనకు కూడా ఇదే చివరి ఫర్మానా అవుతుంది. నాటి నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్‌ను గద్దె దింపి ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా వ్యాఖ్యానించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఓరుగల్లు ప్రజలకు నమస్కారం.. ఈ గడ్డపై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా..’’ అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన నడ్డా.. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, పాలనతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభలో నడ్డా ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

రాష్ట్రం అప్పుల్లో మునిగింది 
‘‘తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని బందీ చేసి.. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అంధకారంలో మునిగింది. లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుంది. రూ.40 వేలకోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిన కేసీఆర్‌ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్షా 40వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంతలా ఎందుకు పెరిగింది? 

కేంద్ర నిధులు మళ్లిస్తూ.. ఆరోపణలు 
తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా.. కేసీఆర్‌ వాటిని ఖర్చు చేయలేదు. పైగా కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో.. తన బొమ్మ పెట్టుకుని, తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని కాకినాడలో మొదట తీర్మానం చేసిందే బీజేపీ అన్న విషయం మరిచిపోవద్దు.  

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. 
సీఎం కేసీఆర్‌ మజ్లిస్‌కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను అధికారికంగా జరుపుతాం. దుబ్బాక, హుజూరాబాద్‌లలో చుక్కలు చూసిన కేసీఆర్‌కు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా చుక్కలు చూపిస్తాం. అవినీతి, తానాషాహి పాలనను బొందపెడతాం. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా.. ఈ సభలో  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, తరుణ్‌ చుగ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. 

లిక్కర్‌ స్కాంను పక్కదారి పట్టించేందుకు మత చిచ్చు: బండి సంజయ్‌ 
తాము ప్రజల సమస్యలు తెలుసుకొని భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ తమ కార్యకర్తలపైనే దాడులు చేయించి, పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు మత చిచ్చు పెట్టి.. ఆ నెపాన్ని బీజేపీపైకి నెడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. హనుమకొండ సభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌.. నన్ను జైలుకు పంపారు. వెళ్లిన.. కరీంనగర్‌కు పోయి కేసీఆర్‌ కోసం ఆ జైలులో రూము రెడీ చేశాను. సిద్దిపేటలో, నల్లగొండ, ఆదిలాబాద్‌ (బైంసా బాధితులు)లో పార్టీ కార్యకర్తలను జైళ్లకు పంపిన కేసీఆర్‌ కోసం ఆ జైళ్లలో కూడా రూములను రెడీ చేశాను. ఇప్పుడు చర్లపల్లి జైలులో కూడా రూమ్‌ రెడీ అవుతోంది..’’ అని వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు.. వందల మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను పాలిస్తూ.. కేసీఆర్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. అరెస్టులు, దాడులతో తన పాదయాత్రను ఆపలేరని, సెప్టెంబర్‌ 12 నుంచి నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపడతానని బండి సంజయ్‌ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని.. ప్రతి చేతికి పని– ప్రతి చేనుకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. 

కేంద్రంపై విష ప్రచారం: జి.కిషన్‌రెడ్డి 
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తున్నా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌– వరంగల్‌ రోడ్డుకు రూ.2,295 కోట్లు, వరంగల్‌ బైపాస్‌ రోడ్డు కోసం రూ.550 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్, జగిత్యాల రోడ్డుకు రూ.2,174 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ నాలుగు లేన్ల రోడ్డుకు రూ.4,321 కోట్లు, వరంగల్‌ నుంచి మంచిర్యాల రోడ్డుకు రూ.4,137 కోట్లు, వరంగల్‌ నుంచి ఖమ్మం నాలుగు లేన్ల రోడ్డుకు రూ.3,364 కోట్లు.. ఇలా అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. 

ఉద్యమకారుడిని కలిసిన నడ్డా 
బహిరంగ సభ కోసం హనుమకొండకు వచ్చిన నడ్డా.. ఇక్కడి బాలసముద్రం ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ నివాసానికి వెళ్లారు. తేనీటి విందు స్వీకరించి కాసేపు వెంకట నారాయణతో మాట్లాడారు. తర్వాత ఇతర నేతలతో కలిసి భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని.. బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. 

కాషాయదళంలో జోష్‌! 
ప్రభుత్వ ఆంక్షలు, అనుమతుల వివాదాల మధ్య అసలు జరుగుతుందా లేదా అన్న సందిగ్ధం మధ్య హనుమకొండలో జేపీ నడ్డా సభ విజయవంతమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనం నుంచి మంచి స్పందన కనిపించడంతో పార్టీ నేతలతోపాటు కార్యకర్తల్లో జోష్‌ కనిపించిందని అంటున్నాయి. ఇన్ని ఇబ్బందులు, గందరగోళం మధ్య సభ విజయవంతం కావడం.. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు సూచిక అని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు