బెంగాల్‌లో ఓడింది.. మరి ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో?

2 May, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. మరోసారి దీదీ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌కే పట్టం కడుతూ తీర్పునిచ్చారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 216 పైగా స్థానాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుండగా.. బీజేపీ 73 చోట్ల ముందంజలో ఉంది. అయితే, గతంతో పోలిస్తే బెంగాల్‌లో ఊహించిన దానికంటే కాషాయ దళం మెరుగైన స్థానంలో నిలిచినట్లే లెక్క. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన కమలం పార్టీ, అప్పటితో పోలిస్తే ఈసారి 70 స్థానాల్లో ముందు వరుసలో ఉంది. లెఫ్ట్‌ పార్టీల ఓట్లకు భారీగా గండికొట్టింది. అయితే, అప్పుడు 211 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టిన టీఎంసీ ఈసారి ఏకంగా 216 స్థానాల్లో సత్తా చాటింది. 

ఇక బెంగాల్‌ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ తదుపరి.. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా ఇతర కేంద్ర మంత్రులు భారీగా ప్రచారం నిర్వహించినా బెంగాల్‌లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోతున్న కాషాయ దళం.. మరి ఈ రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

యూపీలో మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరుగనున్నాయి. నిజానికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ సహా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కేవలం తన నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా పర్యటించి.. మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు బీజేపీ గెలవడంలో కీలకంగా మారారు. ఇదే హవాను కొనసాగిస్తూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలనాథులు స్పష్టమైన మెజారిటీ దక్కించుకోవడంతో యోగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

అయితే, అప్పుడు అఖిలేశ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీజేపీపై, ప్రస్తుతం అదే తరహా విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దళితులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కరోనా విజృంభణ, ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావం తదితర అంశాల నేపథ్యంలో బీజేపీ 2017 నాటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేయడం కాస్త కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గోవాలోనూ
దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్‌ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేయడంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమై మద్దతు కూడగట్టారు.  ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఇక గోవా శాసనసభకు సైతం 2022లోనే ఎన్నికలు జరుగనుండగా, గెలుపు కోసం బీజేపీ శ్రమించకతప్పదని విశ్లేషకులు అంటున్నారు.

పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన స్థానంలో బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్‌ను సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం మాత్రమే ఉన్న సమయంలో ఇలా స్థానిక నేతల్లో విభేదాలు తలెత్తడం, సీఎం మార్పు వంటి అంశాలు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

మణిపూర్‌లో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేనా?
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, లోక్‌ జనశక్తి పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌తో కలిసి అధికారం చేపట్టింది. స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మరీ మంత్రి పదవులు కట్టబెట్టింది. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కచ్చితంగా గట్టి పోటీనిస్తామంటూ ఇప్పటికే సంకేతాలు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పదవులు కట్టబెట్టిన బీజేపీకి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్‌

మరిన్ని వార్తలు