కేంద్ర పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోంది: ఎంపీ లక్ష్మణ్‌

27 Dec, 2022 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్‌ విమర్శించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా తెలంగాణ సర్కారు తీరుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు మోదీ ప్రభుత్వం ద్వారా మేలు జరిగితే ఎక్కడ కేసీఆర్‌ని మరిచిపోతారోనని భయపడి అనేక పథకాలు అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా ఇచ్చినా టీఆర్‌ఎస్‌ సర్కారు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో వాటి పనులు జరగడం లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, దీంతో ఎఫ్‌ఆర్‌బీఎం కింద తెస్తున్న అప్పులు కూడా వడ్డీలు కట్టేందుకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫసల్‌ బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు, విద్యుత్‌ డిస్కం సమస్యలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి అంశాలను తాను ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను గురుకులాల పేరుతో కేసీఆర్‌ భ్రష్టు పట్టించడం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిధులు మళ్లించడం, కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగంపై కూడా  రాజ్యసభలో మాట్లాడానని లక్ష్మణ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు