బిహార్‌లో ఎల్‌జేపీ దూకుడు.. కీలక భేటీ

3 Oct, 2020 16:04 IST|Sakshi

సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి బీజేపీ  

జేడీయూ, ఎల్‌జేపీ నేతలతో కమలం పెద్దల వరుస భేటీలు

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ భేదాలను చక్కదిద్దేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సీట్ల పంపకాల్లో క్లారిటీ కోరుతున్న జేడీయూ, ఎల్‌జేపీ నేతలతో కమలం పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌తో బీజేపీ బాస్‌ జేపీ నడ్డా చర్చలు జరిపి రాజీ ఫార్ములా కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా.. లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి ఎన్ని సీట్లివ్వాలనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈక్రమంలో ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌తో అమిత్‌ షా, నడ్డాలు చర్చించినా విషయం కొలిక్కిరాలేదు. 

ఎల్‌జేపీ కీలక భేటీ..
సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇవాళ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఏర్పాటు చేసింది. బీజేపీ సీట్ల ఫార్ములా ప్రకారం ముందుకెళ్లాలా లేదా 143 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలా అనే విషయమై ఈ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. తాము కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే బీజేపీకి తేల్చిచెప్పిన ఎల్‌జేపీ.. కమలం అభ్యర్థులు పోటీ చేసే చోట మాత్రం తాము అభ్యర్థులను నిలుపబోమని స్పష్టం చేసింది.  

27 సీట్లేనా..?
బిహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇందులో ఏకంగా 143 సీట్లను ఎల్‌జేపీ కోరుతుండగా 27 మాత్రమే ఇచ్చిందుకు బీజేపీ, జేడీయూ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక.. ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగబోతున్నాయి. అధికారం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ కూటమి అమీతుమీ తేల్చుకోబోతుంది. 

>
మరిన్ని వార్తలు