భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్‌

17 Jul, 2022 17:09 IST|Sakshi

ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ‍్యలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌ అంటూ దుయ్యబట్టారు. 

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌. 10వేల ఇండ్లతో కాలనీ, గోదావరిపై కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ ప్రజలను వంచించే హామీలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ చేసిన తప్పిదాలవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందన్నారు. వరదలపై ప్రజలను దారి మళ్లించేందుకే విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం.. ప్రాంతీయ పార్టీల నేతలతో రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్‌ అని.. ఆయన మాటలను నమ్మేదెవరు? అని ప్రశ్నించారు.

కాగా, ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కశ్మీర్‌, లేహ్‌ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్‌ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వరద ముంపు ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ అనుమానాలు.. క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర కోణం దాగి ఉందా?

మరిన్ని వార్తలు