తెలంగాణలో బీజేపీ నిరసనలు..!

11 Nov, 2021 04:57 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనాలని బీజేపీ డిమాండ్‌ 

వివిధ సమస్యలపై వచ్చే రెండేళ్లు పోరుబాటే.. 

పార్టీ ప్రధాన కార్యదర్శులు, మోర్చాలు, జిల్లా ఇన్‌చార్జీల భేటీలో సంజయ్, తరుణ్‌ఛుగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రెండేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ, అధికార టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామ్య విధానాలు, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు పార్టీ భరోసాగా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగించేలా వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని కేడర్‌కు బీజేపీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. దీనిలో భాగంగా వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాష్ట్రం లోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి వాటిపై ఉద్యమ రూపంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చింది.

వచ్చే ఏడాదంతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టివచ్చేలా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను పూర్తిస్థాయిలో ముగించి, 2023 సంవత్సరమంతా అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో నిమగ్నం కావాలని సూచించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచేది బీజేపీనే అనే నమ్మకాన్ని కలిగించే దిశలో కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, వివిధ మోర్చాలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులు, కేడర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు మార్గనిర్దేశనం చేశారు. 

కేసీఆర్‌ సర్కార్‌ దిగిరావాలి... 
ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన నిలిచేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచించారు. వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు సిద్ధమని కేంద్రం గత ఆగస్టులోనే లేఖ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఆ తప్పును కేంద్రంపై నెట్టే యత్నం చేస్తోందన్నా రు. రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి, నియంత, కుటుంబ పాలనను గద్దె దించేందుకు, బీజేపీని అధికారంలో తేవడమే లక్ష్యంగా బండి సంజయ్‌ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర సైతం చరిత్రలో నిలిచిపోతుందని తరుణ్‌ఛుగ్‌ అన్నారు.

తొలిదశ పాదయాత్ర సక్సెస్‌ తోనే కేసీఆర్‌కు ఝలక్‌ ఇవ్వడంతోపాటు టీఆర్‌ఎస్‌కు ప్రత్యా మ్నాయ శక్తి బీజేపీయేనని సంకేతాలు ప్రజలకు పంపగలిగామన్నారు. మలిదశ పాదయాత్రను సైతం ప్రణాళికాబద్దంగా ముందుకు తీసుకెళితే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి, శోభారాణి పాల్గొన్నారు.  

కలెక్టరేట్ల ముట్టడి.. 
ధాన్యం కొనుగోలుకు సరైన ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ల ముట్టడి, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, కొనుగోలు సమయంలో క్వింటాల్‌కు పది కిలోలు తాలు కింద తీస్తున్నారన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోకుండా తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు