మమత ఆడియో కలకలం

28 Mar, 2021 04:20 IST|Sakshi
హౌరాలో సభలో మమతా బెనర్జీ

మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరండి

నందిగ్రామ్‌లో నా గెలుపునకు సహకరించండి

బీజేపీ నాయకుడికి మమత వినతి

ఆడియో క్లిప్‌ను విడుదల చేసిన బీజేపీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్‌ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో నందిగ్రామ్‌పై అందరి దృష్టి పడింది. ప్రళయ్‌ పాల్‌ గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ప్రళయ్‌ పాల్‌తో మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బీజేపీ చెబుతోంది.

ఆడియో క్లిప్‌లో ఏముందంటే..
‘నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్‌ పాల్‌ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్‌ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్‌ పాల్‌ మీడియాతో మాట్లాడాడు.  ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు.

ఎలక్టోరల్‌ అధికారికి బీజేపీ ఫిర్యాదు
మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ౖMðలాశ్‌ విజయ్‌ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది. ఈ ఆడియో క్లిప్‌ వాస్తవికతపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్‌ పాల్‌ గతంలో తమ పార్టీ నాయకుడేనని, అతడితో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్‌ ప్రశ్నించారు. రాజకీయాల్లో  ఇదంతా సహజమేనని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు