సోలోగా ఎల్‌జేపీ.. ప్లాన్‌ మార్చిన బీజేపీ

5 Oct, 2020 14:34 IST|Sakshi

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్‌ మార్చుకుంది. అభ్యర్థుల ఎంపికపై మరోసారి కసరత్తు ప్రారంభించింది. జేడీయూతో కూడిన ఎన్‌డీఏలో తాము చేరబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని లోక్‌ జన శక్తి పార్టీ(ఎల్‌జేపీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడింది. దాదాపు 143 స్థానాల్లో ఎల్‌జేపీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనుంది. ఈక్రమంలో కుల సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే బీజేపీ బిగ్‌ బాస్‌ జేపీ నడ్డాతో బిహార్‌ బీజేపీ ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌మోడీలు ఇవాళ భేటీ కానున్నారు. 

బీజేపీతో ఎల్‌జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ రెండు సార్లు సమావేశమయ్యారు. ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ఈ సమావేశం తర్వాతే ఆయన ప్రకటించారు. బీజేపీ 'ప్లాన్‌ బి'లో భాగంగానే ఎల్‌జేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీయూ ఉన్న ఎన్‌డీఏతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చిరాగ్‌ ప్రకటించినా ఇప్పటి వరకు బీజేపీ నేతలు స్పందించకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్‌జేపీకి దళిత ఓటర్ల మద్దతుంది. 2005 ఎన్నికల్లోనూ ఇలాంటి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగిన ఎల్‌జేపీ... ఆర్‌జేడీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించింది. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం)

మరిన్ని వార్తలు