ప్రజల్ని మతం పేరుతో విభజిస్తున్నారు

28 Mar, 2021 06:22 IST|Sakshi

ప్రజల్ని మతం పేరుతో విభజిస్తున్నారు

కేరళ ఎన్నికల ప్రచారంలో మోదీపై రాహుల్‌ ధ్వజం

ఎరుమెలి ఆలయం, మసీదు సందర్శన

కొట్టాయం: దేశ ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ–ఆరెస్సెస్‌ విభజిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. పరమత సహనానికి బాటలు వేసే ఈ రహదారిని తవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ తమ జీవిత మంతా ప్రయత్నిస్తూ ఉంటారని ఆరోపించారు. నిరంతరాయంగా ప్రజల్లో విద్వేషాన్ని, ఆగ్రహావేశాల్ని నింపుతున్నారని నిందించారు.  కేరళలో శబరిమల యాత్రకు వెళ్లడానికి ముందు కొట్టాయం
జిల్లాలోని ఎరుమెలి ప్రాంతంలో ఆలయం, మసీదు ఒకే చోట ఉంటాయి.

ఆ రెండు పవిత్ర క్షేత్రాల మధ్య  ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ఎరుమెలిలోని అయ్యప్ప సన్నిధిలో పూజలు చేశారు. దాని పక్కనే వవర్‌స్వామికి అంకితమిచ్చిన మసీదులో కూడా ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతానికి చెందిన వవర్‌తో అయ్యప్ప స్వామి స్నేహం చేశారని భక్తుల నమ్మకం. అందుకే శబరిమల యాత్రకి వెళ్లడానికి ముందు కొట్టాయం జిల్లాలోని  అయ్యప్ప స్వామి ఆలయాన్ని, వవర్‌ మసీదుని భక్తులు తప్పనిసరిగా సందర్శిస్తారు. ఇలా రెండు మతాలకు చెందిన క్షేత్రాలను సందర్శించడం చాలా గొప్ప విషయమని రాహుల్‌ పేర్కొన్నారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు పరస్పర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఆనందంగా జీవించాలని, ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో దీనికి మించిన కానుక ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు