Mamata Banerjee: బీజేపీ పాలన హిట్లర్‌, స్టాలిన్‌ కంటే అధ్వానం: మమతా ఫైర్‌

23 May, 2022 21:15 IST|Sakshi

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.. కేంద్ర ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. మోదీ పాలన హిట్లర్‌, జోసెఫ్‌ స్టాలిన్‌, బెనిటో ముస్సోలినీ కంటే దారుణంగా ఉందని మమతా ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో సీఎం మమతా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు.

ఏజెన్సీలను ఉపయోగించి కేంద్రం రాష్ట్రాల ప‌నితీరులో తలదూర్చుతూ స‌మాఖ్య వ్య‌వ‌స్ధ‌ను ధ్వంసం చేస్తోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించ‌డంపై దీదీ ఘాటుగా స్పందించారు.  ప్రభుత్వ చర్చను ఎన్నిక‌ల స్టంట్‌గా అభివ‌ర్ణించారు. ఉజ్వ‌ల యోజ‌న కింద బీపీఎల్ దిగువ‌న ఉండే కుటుంబాల‌కు మాత్ర‌మే గ్యాస్ ధ‌ర‌ను త‌గ్గించార‌ని, ఇది ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ముందు చేప‌ట్టే కంటితుడుపు చ‌ర్యేన‌ని అన్నారు. పేద ప్రజలు రూ. 800 పెట్టి  వంట గ్యాస్ సిలిండ‌ర్‌ను ఎలా కొనుగోలు చేస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు.
చదవండి: ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్‌కు అనుమతిస్తారా?

మరిన్ని వార్తలు