బెంగాల్‌లో మేం గెలిస్తే ఫ్రీగా వ్యాక్సిన్‌: బీజేపీ

23 Apr, 2021 14:24 IST|Sakshi

బీజేపీ ప్రకటనపై రాజకీయ దుమారం

కోల్‌కతా: దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరు వ్యాక్సిన్‌ తీసుకొవచ్చిన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసోం, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ఖర్చు తామే భరిస్తామని.. అందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని ప్రకటించాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్‌లో బీజేపీ చేసిన ఓ ప్రకటన తాజాగా రాజకీయ దుమారం రేపింది.

రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని బెంగాల్‌ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్‌ బీజేపీ శుక్రవారం ఓ ట్వీట్‌ చేసింది. ‘‘పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది’’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ప్రకటనపై రాజకీయ దుమారం రాజుకుంది. అంటే ఎన్నికలు లేకపోతే ప్రజలతో మీకు అవసరం లేదా.. ఓట్ల కోసం ఏమైనా చేస్తారా అంటూ మండిపడుతున్నారు జనాలు.

ఇక దేశప్రజలందరికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ల ప్రయోజనాల గురించి కాకుండా.. దేశ ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. మోదీ రాసిన మరో లేఖలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు లాభాలు గురించి కాకుండా జనాల గురించి ఆలోచించాలని దీదీ లేఖలో పేర్కొన్నారు. 

ఇప్పటికే సీరం ఇన్‌స్టిస్ట్యూట్‌ కోవిషీల్డ్‌ ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రప్రభుత్వాలకు అయితే ఒక్కో డోసు ధరను 400 రూపాయలుగా ప్రకటించగా.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు 600 రూపాలయ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రానికి సప్లై చేసినప్పుడు ఒక్కో డోసు ధర కేవలం 150 రూపాయలు మాత్రమే ఉండటంతో తాజా ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం.. ఒకే ధర ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత

>
మరిన్ని వార్తలు