థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. ఫుల్‌ జోష్‌లో బీజేపీ

6 Aug, 2022 16:23 IST|Sakshi

ముంబై: న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్‌ విసురుతున్నారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే. ఈ తరుణంలో.. తాజాగా థాక్రే శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.  అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా.. థాక్రే సారథ్యంలోని శివ సేన నాలుగో స్థానానికి పరిమితమైంది.

మహారాష్ట్రంలో మొత్తం 28,813 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.  తాజాగా గురువారం 62 మండలాల్లోని 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్‌ జరిగింది. అందులో పుణే, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌ పరిధిలోని గ్రామాలు సైతం ఉన్నాయి. శుక్రవారం వాటికి కౌంటింగ్‌ జరగ్గా.. ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 82 స్థానాలు దక్కించుకోగా.. ఎన్సీపీ 53 స్థానాలు, శివ సేన(షిండే వర్గం) 40 స్థానాలు కైవం చేసుకుంది. 

ఇక శివ సేన(ఉద్దవ్‌ థాక్రే వర్గం) 27, కాంగ్రెస్‌ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంతో బీజేపీ సంబురాలు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ నెంబర్‌ వన్‌ పార్టీ అని, బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని శివ సేన బాగా పని చేసిందని ట్వీట్‌ చేశారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ను, కార్యకర్తలను అభినందించారాయన.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌పాటిల్‌ సైతం స్పందిస్తూ.. ఇది ప్రజాతీర్పు అని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్‌ అగాఢిని ఉద్దేశించి) ఇది ప్రజలు ఇచ్చిన తిరస్కారం, మునుముందు ఇదే కొనసాగుతుంది అంటూ పరోక్షంగా థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ‍్నవీస్‌కు!

>
మరిన్ని వార్తలు